Priayamani: ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ వస్తున్న తమిళ సినిమా జననాయగన్. ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి. అది కూడా సీనియర్ హీరోయిన్, డస్కీ బ్యూటీ ప్రియమణి స్వయంగా వెల్లడించడంతో తమిళ నాట విజయ్ అభిమానులకి ఉత్సాహం రెట్టింపైంది. మరి, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారో డీటేల్స్ లో చూద్దాం.
తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరి సినిమా కథ ఆధారంగానే హీరో, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ నటించిన జననాయగన్ రూపొందిందనే విషయం ప్రమోషనల్ కంటెంట్‌తో అర్థమైంది. తెలుగులో కాజల్ పోషించిన పాత్రను తమిళంలో పూజా హెగ్డే చేసింది. అలాగే, కీలక పాత్రల్లో బాబీ డియోల్, మమిత బైజు, ప్రియమణి నటించారు.
అయితే, తాజాగా ఓ ఈవెంట్ లో ప్రియమణి జననాయగన్ సినిమా గురించి స్పందించింది. మూవీ ఏ డేట్ కి రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేను కానీ, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీగా చెప్పింది. అంతేకాదు, జూలై నెలలోనే రిలీజ్ ఉండొచ్చునని కూడా హింట్ ఇచ్చింది. అలాగే విజయ్ రాజకీయప్రస్థానం గురించి కూడా ప్రియమణి ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ‘విజయ్ గారు సాధించిన విజయాన్ని చూసి తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ తెలిపింది.
అంతేకాదు, ఆయన ప్రజలకు సేవచేయడం కోసమే పుట్టారని అనిపిస్తుంటుందనే మాట కూడా ఎంతో బలంగా చెప్పింది. విజయ్ పుట్టకతోనే నాయకుడు’ అంటూ ఫైనల్ గా ప్రియమణి ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రస్తుతం జననాయగన్ అప్‌డేట్ తో పాటు విజయ్ పొలిటికల్ కెరీర్ గురించి కూడా ప్రియమణి మాట్లాడటం అందరికీ షాకింగ్‌గా ఉంది.












