మహారాష్ట్రను మరోసారి మాన్సూన్ ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై, పుణే, రత్నగిరి, నాసిక్ జిల్లాలు వరదల దాటికి అల్లాడుతున్నాయి.
భారీ వర్షాలు, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబైతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పుణే జిల్లాలో కూడా విద్యాసంస్థలు మూసివేశారు. రత్నగిరి జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడి ఐదు ఇళ్లు మట్టిలో కలిసిపోయాయి.
శిథిలాల కింద పలువురు చిక్కుకుపోగా, 75 ఏళ్ల వృద్ధురాలిని సురక్షితంగా రక్షించారు.. మిగిలిన వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ముంబైలోని నలా సోపారా సహా పలు ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు వెస్ట్రన్ రైల్వే నీటిమునక కారణంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు బయలుదేరే ముందు రైళ్ల స్థితిని తప్పనిసరిగా తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
ముంబై–పుణే రైల్వే ఘాట్ సెక్షన్‌లో కేవలం 24 గంటల్లో దాదాపు 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వరుసగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అదే సమయంలో, కొండచరియల కారణంగా దాదాపు 19 గంటల పాటు మూసివేసిన పుణే–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మిస్సింగ్ లింక్‌ను అధికారులు తిరిగి రెండు లేన్లలో తెరిచారు. ప్రస్తుతం ట్రాఫిక్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
నాసిక్ జిల్లాలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడమే కాకుండా, ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పుణే రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. మొత్తానికి.. మహారాష్ట్రలో మాన్సూన్ ఇంకా ఉద్ధృతంగానే కొనసాగుతోంది. అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.












