ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ వరంగల్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, KUDA చైర్మన్ వెంకట్రామిరెడ్డి మీద సంచలన అవినీతి ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, చైర్మన్ ఇద్దరూ కలిసి కుడా(కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)లో భారీ ఎత్తున అవినీతి పనులకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రెండవ రాజధాని అయిన వరంగల్‌లో గజం స్థలం రూ.1.50 లక్షలుగా ఉంటే.. జూన్ 21 నాడు నాయిని రాజేందర్ రెడ్డి కొందరితో సిండికేట్ అయి KUDA వేలంపాటలో రూ.60 వేలకే తీసుకున్నారని ఆరోపించారు.ప్రపంచమంతా ఆన్‌లైన్ టెండర్లు నడుస్తుండగా KUDAలో మాత్రం ఆఫ్‌లైన్ టెండర్లు ఎందుకు అని ప్రశ్నించారు.
మొత్తంగా 2.27 ఎకరాల స్థలాన్ని KUDA కార్యాలయంలో నాలుగు గోడల మధ్య వాళ్ళే నలుగురు కూర్చొని వేలంపాట పాడి సుమారు రూ.70 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కాగా, దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందేర్ రెడ్డి, చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పందించాల్సి ఉంది.












