రాష్ట్రంలోని గురుకులాల్లో ర్యాగింగ్ పెనుభూతంలా మారింది. అది విద్యార్థినివిద్యార్థులు సరదాచేసినట్టు అనిపించినా ఒక్కోసారి పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నది. కాలేజీల్లో ర్యాగింగ్ గురించి వింటూనే ఉన్నాం. కానీ, పాఠశాల లెవల్లో అదికూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో ర్యాగింగ్ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏమైందంటే..
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఉషాన్ శృతి అనే విద్యార్థినిపై తోటి విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. కళ్లకు గంతలు కట్టి, కాళ్లుచేతులు బిగిసిపట్టి బలవంతంగా పెన్ క్యాప్ మింగించారు. ముందుగా నోట్లో పెన్ క్యాప్ వేసి నీళ్లు పోసి బలవంతంగా మింగించినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత కాసేపటికే బాలికకు కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, స్కానింగ్ చేసి కడుపులో పెన్ క్యాప్ ఉన్నట్టు వైద్యుగు గురించారు. అనంతరం చికిత్స చేసి బయటికి తీశారు. ఈ విషయం కాస్త బాలిక పేరెంట్స్‌కు తెలియడంతో ర్యాగింగ్ ఉదంతంపై కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు తండ్రి ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.












