తెలంగాణ

TG: డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

రచన: Desk 34 నిమిషాల పఠనం

ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే బలమైన ఆరోపణలతో ఏసీబీ (ACB) అధికారులకు దొరికిపోయిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

  • కోర్టుకు ఆధారాలు సమర్పించిన ఏసీబీ

  • రూ.300 కోట్ల అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

  • ల్యాండ్ సెటిల్‌మెంట్లు, రహస్య డైరీపై ఏసీబీ తదుపరి నిఘా

  • గట్టి భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే బలమైన ఆరోపణలతో ఏసీబీ (ACB) అధికారులకు దొరికిపోయిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక సోదాల్లో దాదాపు రూ. 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి.

ఈ భారీ కుంభకోణంపై పూర్తి ఆధారాలు సేకరించిన అధికారులు, ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు తీవ్రతను, లభించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి, భీమ్‌రెడ్డికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్ పీసీఎస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్‌రెడ్డి నివాసాలు, బినామీల ఇళ్లతో సహా 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఏకకాల సోదాల్లో సుమారు రూ.300 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదుతో పాటు గచ్చిబౌలి, మణికొండల్లో ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రెండు రాష్ట్రాల్లో వందల ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్పీ ఇంట్లో దొరికిన ఓ రహస్య డైరీ ఆధారంగా 15 మంది బినామీలను గుర్తించగా, అందులో గతంలో పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్ పేర్లపై కూడా కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు తేలడం సంచలనం సృష్టించింది. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, వారం క్రితం జరిగిన రూ.3కోట్ల లావాదేవీలపై దృష్టి సారించిన ఏసీబీ.. త్వరలోనే బినామీలకు నోటీసులు ఇవ్వడంతో పాటు కోర్టు అనుమతితో బ్యాంక్ లాకర్లను తెరవడానికి సిద్ధమవుతోంది. కాగా, సోదాల సమయంలో అనారోగ్యానికి గురైన భీమ్‌రెడ్డిని ఆసుపత్రిలో చికిత్స అనంతరం అధికారులు అరెస్ట్ చేశారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి