మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఉఖ్రుల్ జిల్లా పరిధిలో విధుల్లో ఉన్న భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డాయి. ఆ ప్రాంతం గుండా వెళ్తున్న అసోం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పేల్చారు.
ఈ ప్రమాదంలో వాహనం ధ్వంసం అవ్వగా.. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.. మరికొంతమంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ.. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా అత్యవసర చికిత్స నిమిత్తం మిలటరీ ఆసుపత్రికి తరలించింది.
దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన అదనపు రక్షణ బలగాలు, ఉఖ్రుల్ జిల్లా పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం దట్టమైన అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఆర్మీ, ప్రత్యేక బలగాలు... దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం..












