భీమ్‌రెడ్డి అక్రమంగా కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు.. హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లోని నివాసం, ఆయన సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి మొత్తం 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. అప్పటి నుండి అజ్ఞాతంలో ఉన్న ఆయనను అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం అధికారికంగా అరెస్ట్ చేసినట్టు సమాచారం.
నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన ప్రాంతాల్లో ఏసీబీ బృందాల సోదాల అనంతరం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. కాగా డీఎస్పీ భీమ్‌రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాంనగర్, ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ విల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల ఎకరాల వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
మరోవైపు భీమ్‌రెడ్డి తన దగ్గర పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్‌ల పేరిట కూడా కోట్లాది రూపాయల బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వీటితో పాటు నిందితుడి ఇళ్ల నుంచి రూ.43.6 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో నిందితుడిని రిమాండ్‌కు తరలించి, మరింత సమాచారం కోసం ఏసీబీ అధికారులు విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం.
పోలీసుశాఖలోని ఒక డీఎస్పీ స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనూ భీమ్‌రెడ్డి పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. కాగా బినామీల పేరిట బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, కర్ణాటకలో మరో 44 ఎకరాల భూములు భీమ్‌రెడ్డి కొనడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వేరే వారికి భీమ్‌రెడ్డి బినామీగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన కేసుల్లో ఒకటిగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.












