హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఐకానిక్ దుర్గం చెరువు పరిసరాలను ఇకపై వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా చూడబోతున్నాం. దీనితో పాటు చారిత్రక తారామతి బారాదరిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ.. నగరంలోని ప్రముఖ మంజీర, దిల్కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో రీ-డిజైన్ చేయనున్నారు.
ప్రకృతి రమణీయతకు నిలయమైన వికారాబాద్ జిల్లా ఇకపై మెగా టూరిజం హబ్ కాబోతోంది. యాదాద్రి తరహాలోనే ఇక్కడి ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి, వీరభద్రస్వామి ఆలయాలకు ప్రత్యేక కమిటీలను వేసి, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే, అటవీ శాఖ పరిధిలోని CURE భూములను ఎకో-టూరిజం స్పాట్లుగా మారుస్తూ.. గుర్రంగూడ తరహాలోనే హైదరాబాద్ నలుమూలలా అధునాతన ఎకో పార్కులను నిర్మించనున్నారు.
మరోవైపు, తెలంగాణ మూడో నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా మార్చనున్నారు. వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారిని నియమించనున్నారు.
అలాగే పర్యాటకులను ఆకర్షించేలా చారిత్రక పురానాపూల్ వంతెనను సరికొత్త హెరిటేజ్ వేదికగా రీ-డిజైన్ చేయనున్నారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఇక్కడ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా సిద్ధమవుతోంది.
ఈ భారీ ప్రాజెక్టులకు అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా.. ఈ ఏడాది డిసెంబర్ 2026 లో ప్రతిష్టాత్మక 'గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్' నిర్వహణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీ కూడా ఏర్పాటు కానుంది.
రేవంత్ రెడ్డి మార్క్ ఈ నయా టూరిజం ప్లాన్.. తెలంగాణ ఆదాయాన్ని పెంచడమే కాకుండా, వేలాది మంది యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టించబోతోందని పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.












