క్రైమ్

యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ రిమాండ్ రిపోర్టులో బయటపడిన సంచలన నిజాలు!

రచన: Desk 24 నిమిషాల పఠనం

నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు యువతను, విద్యార్థులను ఆకర్షించేలా రావణ్ సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్.. అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ ఎపిసోడ్‌లో సరికొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి! ఆయనపై గన్నవరం పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు యువతను, విద్యార్థులను ఆకర్షించేలా రావణ్ సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు, సమాజంలో మతపరమైన విభేదాలు రెచ్చగొట్టడం, రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా రావణ్ వ్యవహరించినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.

ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలోనూ.. వ్యవస్థలపై, పదవుల్లో ఉన్నవారిపై రావణ్ అత్యంత అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు రావణ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

ఆయన ఫోన్‌లో మావోయిస్టు భావజాలానికి సంబంధించిన సమాచారంతో పాటు.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ హిడ్మాను కీర్తిస్తూ చేసిన ప్రసంగాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని.. రావణ్ అనే పేరు వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం విచారణకు నిందితుడు అస్సలు సహకరించడం లేదని, ఆయన వెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇక గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. శనివారం అర్ధరాత్రి రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలపై.. కొత్త చట్టం బీఎన్‌ఎస్‌ సెక్షన్ 152తో పాటు, ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. సమాజంలో చైతన్యం తేవాల్సిన సోషల్ మీడియాను.. అశాంతికి సాధనంగా వాడుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ. మరి ఈ వ్యవహారంలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి!

#YouTuber#Prashna Ravan#remand report#crime#andhara#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి