ఒకప్పుడు మొబైల్ రీఛార్జ్ అంటే... రూ.10, రూ.20 వంటి ధరలతో నేలంతా మాట్లాడుకునే వాళ్ళం.. ఆ తర్వాత రూ.99, రూ.149, రూ.199 ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ కాల్స్, చవకైన డేటా అంటూ టెలికాం కంపెనీలు కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించాయి.
ముఖ్యంగా 4G విప్లవం తర్వాత డేటా ధరలు భారీగా తగ్గడంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. ప్రతి ఏడాది రీఛార్జ్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు వంద రూపాయలలో వచ్చిన ప్లాన్‌లు... ప్రస్తుతం రూ.300 దాటిపోయాయి.
కంపెనీలు తమ లాభాల కోసం ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల.. వినియోగ దారుల బడ్జెట్‌పై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే రీఛార్జ్ ల పెంపుతో సమతం అవుతున్న ప్రజలకు మరోసారి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ అంచనా ప్రకారం.. అన్నీ టెలికాం కంపెనీలు వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో మొబైల్ టారిఫ్‌లు మరో 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
నెట్‌వర్క్ విస్తరణ, 5G పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల పెరుగుదల వంటి కారణాలను టెలికాం కంపెనీలు చూపిస్తున్నా... చివరికి ఆ భారం మాత్రం వినియోగదారుల జేబులపైనే పడుతోంది. ఒకప్పుడు చవకైన రీఛార్జ్‌లతో ఆకట్టుకున్న కంపెనీలు.. ఇప్పుడు వరుస ధరల పెంపులతో వినియోగదారులపై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.












