ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి సైతం ఒకటో తారీఖున జీతాలు ఇచ్చామని ఓ వైపు కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. అయితే, అదంతా ఉత్తదే అని ఉద్యోగులు అంటున్నారు. తమకు ఇంతవరకూ వేతనాలు రాలేదని పలు శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు ఎప్పుడు వేస్తారా? అని నిరీక్షిస్తున్నామని వాపోతున్నారు.
ఇదిలాఉంటే.. సర్కారు ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే వారికి కూడా ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు జూన్ చివరివారం, జులై మొదటి వారంలో మంత్రులు, సీఎం పలుమార్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ వేరేలా ఉన్నది. ఒకటో తేదీన సాయంత్రం 4 గంటల వరకు చాలామంది ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో వారు పనిచేస్తున్న పలు శాఖల కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తంచేశారు. అయితే, సీఎం ఆదేశాలనూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే సగం మందికి జూన్ నెలలోనూ వేతనాలు రాలేదని చెబుతున్నారు.పలు శాఖల్లో పనిచేస్తున్న మరికొందరికి ఏకంగా 4 నెలలుగా జీతాలు రాలేదని తెలుస్తోంది. జీతాలు లేక కుటుంబ పోషణ అత్యంత భారంగా మారుతోందని, వెంటనే తమకు వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.












