రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 13 ఏళ్ల బాలికకు జరిగిన దారుణం దేశాన్ని కలిచివేసింది. ఇంటికి వెళ్లేందుకు ఈ-రిక్షా ఎక్కిన ఆ చిన్నారి.. గమ్యానికి చేరాల్సింది పోయి నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఆమెను పలుచోట్లకు తరలిస్తూ ఐదు రోజుల తరబడి సుమారు 30 మంది వరకు లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆమెను రక్షించిన తర్వాత బయటపడిన వివరాలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధం ఉన్న హోటళ్లపై కూడా అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.
మరోవైపు ఒక 13 ఏళ్ల బాలిక ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవిస్తుంటే, మన సమాజం ఎక్కడ ఉంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. చిన్నారుల భద్రత కుటుంబాల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత కూడా.. ఇలాంటి విషయాన్ని సమాజం విస్మరించడం శోచనీయం.
ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరించాలి. అదే సమయంలో, వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం, చిన్నారుల రక్షణపై మరింత అప్రమత్తత అత్యవసరం.. భయపడే సమాజం కాదు రేపటి తరానికి కావలసింది.. భరోసాతో కూడిన సమాజాన్ని నిర్మించాలి. బాలికల భద్రతే లక్ష్యంగా వ్యవస్థలు పని చేయాలి.












