హైదరాబాద్ బండ్లగూడ సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేయగా..న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ, అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థుల చదువులపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. లేదంటే తమ వద్దనున్న ఆధారాలతోనే ఈనెల 9న తుదితీర్పు వెల్లడిస్తామని స్పష్టంచేసింది.
ఈ క్రమంలోనే న్యాయస్థానం వ్యాఖ్యలపై చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అనాథలు, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలనుకుంటే కూల్చండి. ఒక్కటి కూల్చితే పది భవంతులు నిర్మిస్తా’ అని ఒవైసీ స్పష్టంచేశారు. బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో ఆదివారం సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు,యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అటు హైకోర్టు కామెంట్స్, ఇటు అక్బరుద్దీన్ వ్యాఖ్యలు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మౌనంపై కేంద్రహోం సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా విద్యాసంస్థలను కూల్చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.‘ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అండతోనే హైకోర్టునే బెదిరించేలా హద్దులు మీరి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మౌనంగా ఉంటూ ఎందుకు చూస్తోంది. గండిపేట ఎఫ్‌టీఎల్ పరిధిలోని విద్యాసంస్థలను కూల్చేస్తామని నోటీసుల మీద నోటీసులిస్తున్నారు. ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి రేవంత్ సర్కారు ఎందుకు వెళ్లడం లేదు? ఒవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.












