ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ఇంట్లో ఉన్న ఏనుగు దంతాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కేరళ ప్రభుత్వం తెచ్చిన వన్-టైమ్ 'అమ్నెస్టీ' (స్వచ్ఛంద ప్రకటన) పథకం కింద ఆయన తాజాగా అటవీ శాఖకు అదనపు వివరాలు సమర్పించారు. గతంలో మోహన్‌లాల్ వద్ద కేవలం 4 ఏనుగు దంతాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 46 కిలోల బరువున్న 13 దంతపు విగ్రహాలు (బాలాజీ, శ్రీరాముడు, దశావతారాలు) ఉన్నట్లు వెల్లడైంది. ఇవన్నీ పూర్వీకుల నుంచి వచ్చినవని, కొన్ని కానుకలుగా లభించాయని మోహన్‌లాల్ పేర్కొన్నారు. వీటి మూలాలను తేల్చేందుకు అధికారులు త్వరలోనే డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు.
2011 నుంచి వివాదం
2011లో ఐటీ దాడుల్లో ఈ దంతాలు దొరకడంతో అటవీ శాఖ కేసు నమోదు చేసింది. మోహన్‌లాల్‌పై కేసు ఎత్తివేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నించినా కోర్టులు ఒప్పుకోలేదు. పైగా అక్టోబర్ 2025లో ఆయనకున్న యాజమాన్య పత్రాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే చట్ట ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించే అవకాశం ఇవ్వచ్చని కోర్టు సూచించడంతో ప్రభుత్వం అమ్నెస్టీ పథకం తెచ్చింది. ప్రస్తుతం ఈ పథకం చట్టబద్ధతపై కోర్టులో విచారణ జరుగుతుండటంతో, తదుపరి చర్యలు తుది తీర్పుపైనే ఆధారపడి ఉన్నాయి.












