కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామంలో ఇదే జరిగింది. వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో గ్రామస్థులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి, బంధుమిత్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.
పెళ్లి వేడుకలో మంగళసూత్రం కట్టడం నుంచి ఆశీర్వాదాల వరకు అన్ని సంప్రదాయాలను పాటించారు. అంతేకాదు.. పెళ్లికి హాజరైన గ్రామస్థులకు ఘనంగా విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇది కొత్త సంప్రదాయం కాదని, తరతరాలుగా వస్తున్న ఆచారమని. ప్రకృతి అనుకూలించనప్పుడు, వరుణిడి కరుణ కోసం ఇలాంటి వివాహాలు నిర్వహిస్తే వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నమ్మకమని గ్రామ పెద్దలు తెలిపారు.
శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా... ప్రజల విశ్వాసాలు, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం ఇలాంటి ఘటనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు ఆధునిక యుగంలో సాంకేతికత దూసుకుపోతుంటే... మరోవైపు ప్రకృతిపై ఆధారపడిన గ్రామీణ జీవితం ఇప్పటికీ తమ పూర్వీకుల ఆచారాలను కొనసాగిస్తుండటం విశేషం.
మరోవైపు ఈ వినూత్న వివాహం తర్వాత ఆ గ్రామంపై వరుణుడు కరుణ చూపిస్తాడా? గ్రామస్థుల ఆశలు ఫలిస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












