తెలంగాణ సచివాలయంలో భోజనాలు బంద్ అనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. సెక్రెటేరియట్‌లోని ఆరో అంతస్తులో సీఎం క్యాబిన్ ఉంటుంది. అక్కడి నుంచే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాలనా వ్యవహారాలు చూస్తుంటారు. ప్రస్తుతం సీఎం సెక్రెటేరియట్ రాకపోయినా.. కేసీఆర్ హయాంలో సీఎం చైర్ ఆరో అంతస్తులోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం కొంతకాలం సచివాలయంలోని ఆరో ఫ్లోర్ నుంచి పాలనా వ్యవహారాలు చూశారు.
అయితే, ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో నుంచి లేక కొత్తగా నిర్మించిన ఆఫీసు నుంచి పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. అయితే, సీఎం, సీఎస్, సీఎంవో ఆఫీసులు ఉన్న సచివాలయం ఆరో అంతస్తులో భోజనాల సప్లయ్ నిలిచిపోయింది.కాంట్రాక్టర్‌కు రెండేండ్లుగా బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేసే సీఎం ఆఫీస్ అధికారులు, ఇతర ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులకు అల్పాహారం నుండి భోజనాల వరకు అందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. వారికి శాకాహార భోజనం అందించేవారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భోజనాలు సప్లయ్ చేసే కాంట్రాక్టర్‌కు రెండేండ్లుగా బిల్లులు రావడం లేదని తెలిసింది. ఇదే విషయంపై సదరు కాంట్రాక్టర్ సంబంధిత అధికారులను కలిసి బిల్లులు విడుదల చేయాలని పలుమార్లు విన్నవించినా సరైన స్పందన కరువైంది. బిల్లులు విడుదల చేయకపోగా అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నట్టు గుర్తించిన కాంట్రాక్టర్.. చివరకు చేసేది ఏమీ లేక ఇంకా సొంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలు కాలేనని భోజనం సరఫరా నిలిపివేసినట్టు సమాచారం. కనీసం సరుకులు కొనేందుకు అయినా విడతల వారీగా బిల్లులు చెల్లించాలని అధికారులను విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, సీఎం, సీఎస్, సీఎంవో అధికారులు, ఇతర కీలక ఉద్యోగులు ఉండే ఆరో అంతస్తుకు భోజనం సరఫరా లేకపోతే ఎలా అంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.












