రాజకీయాలు

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!.. కేంద్ర మంత్రి ఫైర్..

రచన: Desk 24 నిమిషాల పఠనం

ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం, అక్రమ కట్టడాలపై కఠిన చర్యల కోసం సృష్టించిన హైడ్రా పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుంది!..

తెలంగాణలో ట్రయాంగిల్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. మూడు పార్టీల చుట్టూ తిరుగుతున్న పొలిటికల్ డ్రామా రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పై బిఆర్ఎస్ నేతలు.. కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు గుప్పించగా.. ఇప్పుడు కిషన్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం, అక్రమ కట్టడాలపై కఠిన చర్యల కోసం సృష్టించిన హైడ్రా పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని మండిపడ్డారు. అలాగే పేద ముస్లింల ఇళ్లు ను హైడ్రా కూల్చివేస్తున్నప్పుడు కాంగ్రెస్, మజ్లిస్‌లు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.

అదేవిధంగా ఇప్పుడు ఒవైసీ సోదరుల ఆస్తులను కాపాడే విషయంలో సైతం ఈ రెండు పార్టీలు ఒకే ఆలోచనతో వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఓవైసీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాష్​ట్ర ప్రభుత్వం మిన్నకుండా ఉంటుందని చురకలంటించారు.

అదే సమయంలో మజ్లిస్‌ పార్టీని కాపాడే విషయంలో కాంగ్రెస్‌ ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనకాడటం లేదని విమర్శించిన కిషన్ రెడ్డి.. సామాన్యుల విషయంలో మాత్రం స్వార్థపూర్తి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు.

ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ప్రజల పట్ల, పేదల పట్ల చిత్త శుద్ధి ఉంటే.. సల్కం చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు.

పలుమార్లు తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుని.. ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా వారి తీరులో మార్పులేదని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల విషయంలో చూపే తొందరపాటును.. ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.

ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను, మజ్లిస్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. పేదల కోసం హైడ్రా బుల్డోజర్లతో విధ్వంసం చేపడుతుంటే కాంగ్రెస్-మజ్లిస్ మాత్రం తమ రాజకీయ ఉనికి కోసం ప్రాకులాడుతున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు..

#telangana#kishan-reddy#congress#fatima-college-issue#political
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి