తిరుమల క్షేత్రంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తి ముందు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 116 ఏళ్ల వృద్ధురాలు కాలినడకన కొండపైకి చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో ఆమె వెళ్తుండగా తోటి భక్తురాలు తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియో కాస్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించి, ఆ బామ్మ భక్తిప్రపత్తులను అభినందించారు.
మొదట ఈ వృద్ధురాలు కర్ణాటకకు చెందినవారని ప్రచారం జరిగినప్పటికీ, టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అసలు వివరాలను సేకరించారు. ఆమెను తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. తిరుపతి జీవకోనలోని తన బంధువుల ఇంట్లో ఉన్న నవనీతమ్మను అధికారులు సంప్రదించి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు.
సామాన్య భక్తురాలి అచంచల భక్తిని గౌరవిస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తజనకోటి హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అరుదైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (X) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. 116 ఏళ్ల వయసులో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన వెళ్లడం అత్యంత ఆశ్చర్యకరమని, ఆమె నమ్మకానికి కుటుంబ సభ్యులు తోడుగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొనగా.. శ్రీవారి ఆశీస్సులతో నవనీతమ్మ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని టీటీడీ ఛైర్మన్ ఆకాంక్షించారు.












