ప్రపంచం

కష్ట కాలంలో అండగా నిలిచిన భారత్‌పై ఇరాన్ కీలక వ్యాఖ్యలు!

రచన: Desk 23 నిమిషాల పఠనం

కష్ట సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి, తమ సానుభూతిని తెలియజేసిన భారత ప్రతినిధి బృందానికి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఇరాన్ దివంగత సుప్రీం నేత అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. భారత్ ప్రదర్శించిన సంఘీభావం ఇరుదేశాల మధ్య ఉన్న చిరకాల బంధానికి సరికొత్త ప్రతీకగా నిలిచింది. కష్ట సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి, తమ సానుభూతిని తెలియజేసిన భారత ప్రతినిధి బృందానికి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

భారత్ చూపిన ఈ ఆత్మీయతను తాము ఎప్పటికీ మరచిపోలేమని భావోద్వేగంగా పేర్కొంది. ఇది కేవలం దౌత్యపరమైన సందర్శన మాత్రమే కాదు.. ఇరుదేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి సాక్ష్యమని ఇరాన్ కొనియాడింది.

టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మసీదులో జరిగిన ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల్లో... భారత్ తరఫున అధికారిక, అనధికారిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. బిహార్ గవర్నర్, సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో పాటు... కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలు ఈ బృందంలో ఉన్నారు.

అంతేకాదు, భారతదేశ సర్వమత సమభావనను చాటుతూ... హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మత పెద్దలు కూడా ఖమేనీ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించడం విశేషం. టెహ్రాన్‌లో ప్రముఖుల నివాళుల అనంతరం.. ఈ నెల 9వ తేదీన ఖమేనీ సొంత పట్టణమైన మషహద్ లో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు.

#world#irans#thank-you#amid-khameneis#funeral#india
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి