Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు, యువత పార్లమెంటు ముట్టడికి యత్నిస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు బలగాలు శ్రమిస్తున్నాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేస్తున్నారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ రూపొందించింది.
ఇందులో భాగంగా లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ నివాసం ముట్టడి చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీలు అంతా కలిసి మోదీ ఇంటి ఎదుట బైఠాయించారు. మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు. యువతపై పోలీసుల చర్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
నీట్ పేపర్ లీకేజ్ అరికట్టలేని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీజేపీ కార్యకర్తల మీద లాఠీఛార్జ్ చేయించిన హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
''నిన్న జరిగిన దానికి మోదీజీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. యువత విద్య, పరీక్షా విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. విద్య, పరీక్షా విధానం చెదపురుగుల వల్ల డొల్లగా మారిందని దేశమంతటికీ తెలుసు" అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. "దేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధాని, హోం మంత్రి రాజీనామా చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం సీజేపీ నేతృత్వంలో జరిగిన పార్లమెంటు మార్చ్ సందర్భంగా యువతపై పోలీసులు "క్రూరత్వానికి" పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రధాని నివాసం వైపు పాదయాత్ర చేశారు. దీంతో ప్రధాని నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. భారీగా బలగాలను భారీగా మోహరించారు.
మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని ఇంటి బయట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను కలిశారు. రాహుల్ గాంధీతో మాట్లాడారు. ధర్నాను విరమించాలని కోరారు. అయితే, అందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు. అవసరమైతే రాత్రి మొత్తం ప్రధాని ఇంటి ఎదుట ధర్నాలో కూర్చుంటామన్నారు. దీంతో పాటు 5 డిమాండ్లను జితేంద్ర సింగ్ ఎదుట ఉంచారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంటు వేదికగా హోంమంత్రి ప్రకటన చేయాలి, నీట్ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలి, విద్యార్థుల సమస్యలను వినాలి అనే డిమాండ్లను జితేంద్ర సింగ్ ముందుంచారు కాంగ్రెస్ నేతలు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












