Maruti Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గరిష్ఠంగా 30వేల రూపాయల వరకు ధరలు పెరగనున్నాయని వెల్లడించింది. ఆగస్టు నెల నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది.
ధరల పెంపునకు గల కారణాలను మారుతి సుజుకి ఇండియా వివరించింది. ముడి సరుకులు, రవాణ, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి అంతర్గతంగా అనేక చర్యలు చేపట్టామంది. అయినప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో కొంత భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు చెప్పింది.
ఖర్చులను తగ్గించే చర్యల ద్వారా వ్యయ భారాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ మే నెలలో తెలిపింది. పనితీరును మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముడి పదార్థాల వ్యయాలు (ముఖ్యంగా విలువైన లోహాలు ఇతర సరుకుల ధరలు) పెరుగుతూనే ఉండటంతో మరో విడత ధరల పెంపును పరిశీలిస్తున్నట్లు ఫిబ్రవరిలో పేర్కొంది. తాజాగా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది.
కొన్ని నెలలుగా వ్యయ నియంత్రణ చర్యల ద్వారా ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించామని కంపెనీ తెలిపింది. అయితే ద్రవ్యోల్బణ భారం అధిక స్థాయిలో ఉండటం, ప్రతికూల వ్యయ వాతావరణం కొనసాగుతుండటంతో పెరిగిన వ్యయంలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయక తప్పడం లేదని వివరించింది. కాగా, కస్టమర్లపై దీని ప్రభావం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తామని మారుతి సుజుకి చెప్పింది.
ఇక, ధరల పెంపు అన్ని మోడల్స్ పై ఒకేలా ఉండదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. వాహనం మోడల్‌ను బట్టి పెంపు మారుతుందని తెలిపింది. అయితే, ఏ మోడల్‌పై ఎంత ధర పెరుగుతుందనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అటు BSEలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) షేర్లు రూ. 122.55 పెరిగి, ఒక్కో షేరుకు రూ. 13,630 వద్ద ట్రేడ్ అయ్యాయి.












