ప్రపంచం మొత్తం డిజిటల్ వ్యవస్థగా మారిపోతుంది. ఇప్పటికే ప్రతి చోట ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇదే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ఏ చిన్న పని జరగాలన్న ఆన్ లైన్ సెంటర్ కు లేదా ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ తో చేసుకునే సదుపాయం అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఈ క్రమంలో దేవాదాయ శాఖలో డిజిటల్ పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సామాన్య భక్తులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు.
ఆలయాల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తున్న టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (TAMS), అలాగే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన తెలంగాణ ధార్మిక, హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయాల (సవరణ) చట్టం–2025 ముసాయిదా నియమావళిపై మంత్రి సోమవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలనను సంపూర్ణంగా డిజిటలీకరించే దిశగా రూపొందించిన టామ్స్ లోని వివిధ మాడ్యూళ్ల పనితీరును మంత్రి సురేఖ పరిశీలించారు. అలాగే భూముల రక్షణ, ఆదాయ వ్యయాల నమోదు, ఈ-ఆఫీస్ విధానం, ఆలయ ఆస్తులు, భక్తులకు అందించే సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.












