సింగపూర్‌లో అత్యంత ఖరీదైన వజ్రాన్ని కొట్టేయడానికి ఇద్దరు భారతీయులు వేసిన పక్కా ప్లాన్ చివరకు తిరగబడింది. సుమారు రూ.1.48కోట్ల విలువ చేసే డైమండ్‌ను నకిలీదానితో మార్చేందుకు పథకం రచించిన ఇద్దరిలో ఒకరికి అక్కడి న్యాయస్థానం రెండేళ్ల రెండు నెలల జైలు శిక్ష విధించింది. అసలు వజ్రం పోలికలతో ఉన్న ఒక నకిలీ డైమండ్‌ను ముందే తయారు చేయించుకుని పర్యటక వీసాపై సింగపూర్ చేరుకున్నట్లు విచారణలో తేలింది.
సింగపూర్‌లోని చైనాటౌన్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ జ్యువెలరీ షాప్‌లోకి ప్రవేశించిన ఈ ఇద్దరు.. 4.95 క్యారెట్ల ఖరీదైన వజ్రాన్ని చూపించాలని సిబ్బందిని కోరారు. ఒక నిందితుడు సేల్స్ మేనేజర్‌ను మాటల్లో పెట్టి దృష్టి మళ్లించగా, మరో నిందితుడు తన నోటిలో దాచుకున్న నకిలీ వజ్రాన్ని తెలివిగా బయటకు తీశాడు. అసలు వజ్రం స్థానంలో నకిలీది ఉంచి, నిజమైన డైమండ్‌ను తన నోట్లోనే దాచేసుకుని అక్కడ నుంచి జారుకున్నారు. అయితే వీరి చాకచక్యం అంతా షాప్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నిక్షిప్తమైంది.
జ్యువెలరీ షాప్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సిబ్బందికి అనుమానం వచ్చింది. ప్రత్యేక మిషన్‌తో ఆ వజ్రాన్ని పరీక్షించగా అది నకిలీదని తేలడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నిందితులిద్దరూ ముందే బుక్ చేసుకున్న విమానంలో భారత్ పారిపోయేందుకు హోటల్ ఖాళీ చేసి చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వద్ద రెస్క్యూ బృందాలు చాకచక్యంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేసి, బ్యాగ్‌లో దాచిన అసలు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కేవలం ఈ చోరీ కోసమే సింగపూర్ వచ్చి, ముందస్తు ప్రణాళికతో నేరానికి పాల్పడినందున నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. నిందితుడు మంగ్రోలియా మనోజ్‌కుమార్ తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతనికి జైలు శిక్ష ఖరారు చేసింది. కాగా ఈ కేసులో భాగస్వామిగా ఉన్న మరో నిందితుడు సెరాసియా మిలన్ రామ్నిక్‌భాయ్ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.












