తెలంగాణ

Kodad: బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం!.

రచన: Venu4 నిమిషాల పఠనం

ఇటీవల యువతలో మోడిఫైడ్ సైలెన్సర్లపై క్రేజ్ పెరిగిపోతోంది. కంపెనీ సైలెన్సర్‌ను తొలగించి.. భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను బైక్‌లకు అమర్చడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. కానీ ఈ శబ్దాల వెనుక సమస్యలు దాగి ఉన్న విషయాన్ని మరచిపోతున్నారు.

ఇటీవల యువతలో మోడిఫైడ్ సైలెన్సర్లపై క్రేజ్ పెరిగిపోతోంది. కంపెనీ సైలెన్సర్‌ను తొలగించి.. భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను బైక్‌లకు అమర్చడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. కొందరు అయితే రోడ్డుపై బైక్ నడుపుతూ కావాలనే శబ్దాలు చేస్తూ ఇతరులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ శబ్దాల వెనుక సమస్యలు దాగి ఉన్న విషయాన్ని మరచిపోతున్నారు.

వృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు.. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రజలు.. ఈ భారీ శబ్దాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వచ్చే పెద్ద శబ్దాలతో పక్కన వెళ్ళే వాహనదారులు ఉలిక్కిపడే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు.. రోడ్డుపై వేగంగా, ప్రమాదకరంగా బైక్‌లు నడుపుతూ ఈ శబ్దాలను వినోదంగా భావించడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు మోడిఫైడ్ సైలెన్సర్లపై ఉక్కుపాదం మోపారు. కోదాడ పట్టణ, ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 40 బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లను గుర్తించి సీజ్ చేశారు.

ఆ సైలెన్సర్లను ఇకపై ఎవరూ ఉపయోగించకుండా.. కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ చర్య ద్వారా.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే స్పష్టమైన సందేశాన్ని పోలీసులు ఇచ్చారు.

మితిమీరిన శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కంపెనీ సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు బైక్‌ సైలెన్సర్ మార్చడం యువతకు ఫ్యాషన్ కావచ్చు. కానీ దాని వల్ల వచ్చే శబ్దం.. మరొకరి ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, భద్రతను డిస్ట్రబ్ చేస్తుందని గుర్తించకపోవడం ఆవివేకం, అజ్ఞానంతో సమానం.. స్టైల్ అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించడం కాదు.. బాధ్యతగా వాహనం నడపడం. రోడ్డు మీద రేసింగ్ చేయడం కాదు.. సురక్షితంగా ఇంటికి చేరుకోవడం.

#Telangana#Suryapet district#Kodad#Police serious#bullet bike silencers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి