Puri Jagannadh: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నధ్ తల్లి ఇక లేరు. అవును, పూరి జగన్నాధ్ తల్లి (96) కన్ను మూశారు. ఈ విషయాన్ని, పూరి తనయ పవిత్ర తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలిపింది. అంతేకాదు, పవిత్ర పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు, అంతటా వైరల్ అవుతోంది. తన నానమ్మ చనిపోయిన విషయాన్ని తెలుపుతూ..ఆమెతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి రాసుకొచ్చింది.
"ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ"..అంటూ పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు.. పూరీ కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతున్నారు.
ఇక, పూరి జగన్నాధ్.. బద్రి సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం రావడం..ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వైష్ణో అకాడమి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, పోకిరి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు.
ఆ తర్వాత, ఛార్మీతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై కూడా చాలా సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించాడు పూరి జగన్నాధ్. మధ్యలో, ఫ్లాపులొచ్చినప్పటికీ, ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో, హీరోయిన్‌గా సంయుక్త మేనన్, కీలక పాత్రలో టబు కనిపించబోతున్నారు.












