కర్ణాటక రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. 2028లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, అలాగే రాజకీయాల్లో పెరుగుతున్న అవినీతి తన నిర్ణయానికి ప్రధాన కారణాలని వెల్లడించారు.
మండ్య జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరం కాబోనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని, ప్రజల కష్టసుఖాల్లో వారికి అండగా ఉంటానని చెప్పారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని సిద్ధరామయ్య తెలిపారు. కానీ 2028 ఎన్నికల నాటికి తన వయస్సు 82 సంవత్సరాలకు చేరుకుంటుందని.. అప్పటికి గతంలో ఉన్నంత శక్తితో పనిచేయడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు.
ఇదే సమయంలో రాజకీయ వ్యవస్థపై కూడా సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు అవినీతి కూపంగా మారాయని ఆరోపించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని.. 2028 నాటికి ప్రజా జీవితంలో తనకు 50 ఏళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలు చూశానని.. కానీ నైతిక విలువలు, సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. ఒకప్పుడు ప్రజలే తమకు తోచినంత సాయం చేసి ఎన్నికల ప్రచారాలకు మద్దతు ఇచ్చేవారని గుర్తు చేసిన సిద్ధరామయ్య.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఓటర్లకు డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. నిజాయితీతో కూడిన రాజకీయాలకు స్థానం తగ్గిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు గతంలో అధికార మార్పుపై కర్ణాటకలో జరిగిన చర్చల నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 2028 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. సిద్ధరామయ్య పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పడం కన్నడ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.












