Telangana: తెలంగాణ ఆర్టీఐ ఆన్‌లైన్ పోర్టల్ సమర్థవంతంగా పని చేయకపోవడం, తెలంగాణ సమాచార కమిషన్‌లో హైబ్రిడ్ విచారణలు అమలు కాకపోవడం వంటి అంశాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో (పిల్) తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పి. సామ్ కోషీ, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండలతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారం రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ పిల్‌ను మెదక్‌కు చెందిన న్యాయ విద్యార్థి బానప్పగారి వినయ్ రెడ్డి పార్టీ-ఇన్-పర్సన్‌గా దాఖలు చేశారు. ఐటీ శాఖ నుంచి ఆర్‌టీఐ ద్వారా పొందిన అధికారిక సమాచారం ప్రకారం, తెలంగాణ ఆర్టీఐ ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 17,865 ఆర్‌టీఐ దరఖాస్తులు నమోదు కాగా, వాటిలో కేవలం 377 మాత్రమే పరిష్కరించబడ్డాయి. అలాగే 2,502 మొదటి అప్పీలు నమోదు అయినప్పటికీ ఒక్క అప్పీల్ కూడా పరిష్కారం కాలేదు. పోర్టల్‌లో 3,323 ప్రభుత్వ సంస్థలు నమోదు అయినప్పటికీ, కేవలం 17 సంస్థలు మాత్రమే ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరాలు వెల్లడించాయి.
పిటిషనర్ సుప్రీంకోర్టు Kishan Chand Jain v. Union of India (2023 INSC 915) తీర్పును ప్రస్తావిస్తూ, అన్ని రాష్ట్ర సమాచార కమిషన్లలో హైబ్రిడ్ విచారణలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు తెలంగాణలో ఇప్పటికీ అమలు కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే Pravasi Legal Cell v. Union of India (2023) తీర్పు ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీఐ ఆన్‌లైన్ పోర్టల్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని వాదించారు.
ఈ కేసు పారదర్శక పరిపాలన, సమాచార హక్కు సమర్థవంతమైన అమలు, సాంకేతికత ద్వారా పౌరులకు సులభంగా న్యాయం అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలకు సంబంధించినందున రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్ అనంతరం ఈ అంశాలపై హైకోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం ప్రాముఖ్యత సంతరించుకుంది.












