మనుషుల తెలివితేటలు నిజంగానే తగ్గిపోతున్నాయా అంటే.. అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ అధ్యయనాలు. స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువై, ప్రతీ చిన్నదానికి గూగుల్‌పై ఆధారపడటం మొదలుపెట్టినప్పటి నుంచి మన మేధో సామర్థ్యం (IQ) మెల్లమెల్లగా పడిపోతోందని పరిశోధకులు బాంబు పేల్చారు. ఒకప్పుడు తరతరానికి పెరిగిన తెలివితేటలు, ఇప్పుడు తిరోగమనంలో పయనించడానికి మన మారిన జీవనశైలే కారణమని తేల్చిచెబుతున్నారు.
నార్వేలో 1962 నుంచి 1991 మధ్య జన్మించిన దాదాపు 7.3లక్షల మందిపై జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1970ల మధ్య వరకు పుట్టిన వారిలో ఐక్యూ పెరిగినప్పటికీ, ఆ తర్వాత జన్మించిన వారిలో ప్రతి ఏటా సగటున 0.3 పాయింట్ల చొప్పున స్కోర్లు తగ్గుతూ వచ్చాయి. డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, యూకేలలో కూడా ఇదే రకమైన రివర్స్ ట్రెండ్ కనిపించింది. ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములను పరిశీలించినప్పుడు కూడా పెద్దవారి కంటే చిన్నవారికే తక్కువ స్కోర్లు వచ్చాయి. దీనికి జన్యుపరమైన లోపాలు కారణం కాదని, మనం అనుసరిస్తున్న జీవనశైలే కారణమని తేలింది.
ఈ మేధో క్షీణతకు ఆధునిక అలవాట్లు, డిజిటల్ పరిజ్ఞానమే ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు, లెక్కలకు కూడా సొంతంగా ఆలోచించకుండా స్మార్ట్‌ఫోన్లు, సెర్చ్ ఇంజిన్లపై ఆధారపడే ‘కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్’ ఎక్కువైంది. దీనికితోడు నిరంతర నోటిఫికేషన్లు, సోషల్ మీడియా రీల్స్ వల్ల మానసిక ఏకాగ్రత, పని చేసే సామర్థ్యం బాగా దెబ్బతింటున్నాయి. ఒకప్పుడు పుస్తకాలు లోతుగా చదివే అలవాటు ఉండేది, కానీ ఇప్పుడు కేవలం హెడ్‌లైన్లు, చిన్న పోస్టులు స్కాన్ చేయడానికే పరిమితం కావడంతో భాషా నైపుణ్యాలు మందగిస్తున్నాయి.
అయితే, ఈ పరిస్థితిని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇది పూర్తిగా పర్యావరణ, జీవనశైలి మార్పుల వల్ల జరిగింది కాబట్టి, సరిదిద్దుకోవడం తేలికేనని చెప్తున్నారు. నిరంతరం స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని తగ్గించుకుని, ప్రతిరోజూ పుస్తకాలు చదవడం, శారీరక వ్యాయామం చేయడం, సరైన నిద్ర, పోషకాహారం తీసుకోవడం ద్వారా మేధో సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. సమర్థవంతమైన అలవాట్లతో మెదడుకు తిరిగి పదును పెట్టవచ్చని స్పష్టం చేస్తున్నారు.












