తెలంగాణ

TG: తెలంగాణ జాగృతి నూతన సారథిగా మారిపల్లి మాధవి.. బాధ్యతలు అప్పగించిన కవిత

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి వెన్నుముకలా నిలిచిన ‘తెలంగాణ జాగృతి’ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా సంస్థను ముందుండి నడిపించిన కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మారిపల్లి మాధవికి అప్పగించారు.

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి వెన్నుముకలా నిలిచిన ‘తెలంగాణ జాగృతి’ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా సంస్థను ముందుండి నడిపించిన కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మారిపల్లి మాధవికి అప్పగించారు. కవిత ఇకపై ‘ఫౌండర్ ఛైర్‌పర్సన్’గా మార్గదర్శకత్వం వహించనుండగా, సంస్థను మరింత బలోపేతం చేసేందుకే ఈ నాయకత్వ మార్పులు చేపట్టినట్లు ప్రకటించారు.

ఈ మేరకు మారిపల్లి మాధవిని నూతన అధ్యక్షురాలిగా నియమిస్తూ కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత విస్తరించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగానే ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో జాగృతి ప్రజలకు మరింత చేరువై, తన లక్ష్య సాధనలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణే జాగృతి ప్రధాన ధ్యేయమని కవిత గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో, తెలంగాణ చరిత్ర, జీవన విధానం, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలనే సంకల్పంతో 2006లో ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. మలిదశ ఉద్యమానికి సాంస్కృతిక బలం చేకూర్చడంలో జాగృతి పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనదని, దేశవిదేశాల్లో మన సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పామని చెప్పారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మున్ముందు కూడా సంస్థ సేవలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

ముఖ్యంగా తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను విశిష్టమైన రీతిలో నిర్వహించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయడంలో తెలంగాణ జాగృతి చేసిన కృషి అపారమైనదని కవిత కొనియాడారు. బతుకమ్మ ఉత్సవాలను ఒక వేదికగా మలచి, రాష్ట్రంలోని మహిళ లోకాన్ని పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత జాగృతికే దక్కుతుందన్నారు. కేవలం పండుగలకే పరిమితం కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తామని వివరించారు.

https://x.com/TJagruthi/status/2081628452244050383?s=20

#Telangana Jagruthi New President#Kalvakuntla Kavitha News#Maripalli Madhavi Jagruthi#Telangana Jagruthi News#Kavitha Kalvakuntla Jagruthi#Telangana Culture News#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి