వైరల్ న్యూస్

RGV: ‘నీట్ పేపర్ లీకేజీ కంటే ఏఐ డేంజర్..’ ఆర్జీవీ సంచలన కామెంట్స్!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

దేశంలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల విద్యా రంగానికి ఎదురవుతున్న ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల విద్యా రంగానికి ఎదురవుతున్న ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ సమస్యల వల్ల విద్యా వ్యవస్థకు కేవలం రక్తస్రావం మాత్రమే జరుగుతుంటే, ఏఐ మాత్రం ఆ వ్యవస్థ గొంతు కోసేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం విద్యార్థులకు 10 లేదా 20 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదని వర్మ వ్యాఖ్యానించారు. ఒకసారి చదివితే జీవితాంతం ఉద్యోగ భద్రత ఉంటుందనే భావనను ఏఐ పూర్తిగా మార్చేసిందన్నారు. సమాచారాన్నంతటినీ నిమిషాల్లో ప్రాసెస్ చేస్తూ మానవ మెదడు కంటే అత్యంత వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తోందని వివరించారు. 'కష్టపడి చదువుకుంటే జీవితంలో స్థిరపడవచ్చు' అనే పాతకాలపు నమ్మకాన్ని ఏఐ పూర్తిగా తుడిచిపెట్టేసిందని తెలిపారు. ఇకపై కేవలం మార్కులు, డిగ్రీలు, కంఠస్థం చేసే సామర్థ్యాలకు కాలం చెల్లిపోయిందని స్పష్టం చేశారు.

‘ఏఐ నేర్పించని చదువు వ్యర్థం’

ఏఐని ఉపయోగించడం నేర్పించని ఏ చదువు అయినా వ్యర్థమేనని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. సాంకేతికత సాయంతో ఒక్క వ్యక్తి మాత్రమే డాక్టర్, లాయర్, ఇంజనీర్, సీఏ లాంటి విభిన్న పాత్రలను మానవుల కంటే వేగంగా నిర్వర్తించగలడని చెప్పారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఎంబీఏ చదివే విద్యార్థుల డిగ్రీలు భవిష్యత్తులో కేవలం కాగితాలుగానే మిగిలిపోతాయని, మార్కెట్‌లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు వేగంగా కనుమరుగవుతాయని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికే ప్రవేశ స్థాయి ఉద్యోగాలపై ఏఐ ప్రభావం మొదలైందని ప్రపంచ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో AIను సమర్థంగా వినియోగించడం నేర్పించే విద్య మాత్రమే భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని వర్మ పేర్కొన్నారు. AI శిక్షణ ఇవ్వని విద్యాసంస్థలు విద్యార్థులను లేని ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నట్లేనని విమర్శించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మలచుకోవడమే ఇప్పుడున్న ఏకైక మార్గమని వర్మ సూచించారు. AI మార్పును అంగీకరించి దాన్ని వినియోగించేవారే భవిష్యత్తులో విజయవంతమవుతారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో వస్తున్న ఈ తీవ్ర మార్పులను, చేదు వాస్తవాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇప్పటికైనా గ్రహించి మేల్కోవాలని ఆర్జీవీ ‘ఎక్స్’లో సుదీర్ఘంగా రాసుకొచ్చారు.

 https://x.com/RGVzoomin/status/2081571091403907370?s=20

#RGV On Artificial Intelligence#RGV Tweet AI Education#Future Of Jobs AI#RGV News Telugu#AI Impact On Degree#Artificial Intelligence Education Threat
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి