ఏపీలో మరోసారి పొలిటికల్ పంచాయితీ నెలకొంది. మాజీమంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుతో టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు పక్కన కూర్చుని ముచ్చట పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావుకు టీడీపీ అధిష్ఠానం షోకాజ్ నోటీసుల ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను పదేపదే తిట్టే అంబటి రాంబాబు పాల్గొన్న కార్యక్రమానికి బొండా ఉమా వెళ్లడంతో వివాదం చెలరేగినట్టు తెలిసింది.
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించే అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్న బొండా ఉమా పొత్తు ధర్మాన్ని పాటించలేదని కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలాఉంటే, తన పర్యటనపై చెలరేగిన వివాదంపై బోండా ఉమ స్పందించారు. ఇప్పటివరకూ పార్టీ అధిష్ఠానం తనను ఏ వివరణ అడగలేదని, ఒకవేళ అడిగితే కచ్చితంగా సమాధానం ఇస్తానని క్లారిటీ ఇచ్చారు.
https://x.com/TeluguScribe/status/2081428640735330726?s=20
తాను ప్రతిపక్ష వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా మాత్రమే పలకరించానని ఉమా క్లారిటీ ఇచ్చారు. గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఆ సభలో ఆనాడు బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా వంటి వైసీపీ నేతలతో మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. మరి వాళ్లను కూడా పార్టీ వివరణ అడుగుతుందా? అని నిలదీసిన బొండా ఉమ.. మిగతా నేతల విషయంలో లేని వివాదాలు, వివరణలు తన విషయంలోనే ఎందుకు వస్తున్నాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ పార్టీకి ఇబ్బందులు కలిగించే పనులు చేయలేదని, టైం వచ్చినప్పుడు దీనిపై పూర్తి వివరాలు చెబుతానని అన్నారు.












