దేశంలో సోషల్ మీడియా వేదికగా సరికొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనలు దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసిన విషయం తెలిసిందే.తాజాగా అదే డిజిటల్ వేదికగా ‘రిజర్వేషన్స్ హటావో ఆందోళన్’ (RHA) పేరిట కొత్త ఉద్యమం పురుడుపోసుకుంది.నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్స్‌తో పురుడుపోసుకున్న కాక్రోచ్ పార్టీ..కేంద్రమంత్రి రాజీనామా కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
యువత, విద్యార్థిలోకం ఈ ఆందోళనలకు పెద్దఎత్తున మద్దతు పలికింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పార్లమెంట్ సమావేశాల సమయంలో తీవ్రరూపం దాల్చింది. యువత డిమాండ్లకు మొత్తానికి కేంద్రం దిగిరాక తప్పలేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడం.. నిరసనలు తెలుపుతున్న సమయంలో విద్యార్థుల మీద నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారానికి కేంద్రం అంగీకరించడంతో సీజేపీ, విద్యార్థిలోకం నిరసనలు ముగించాయి.
అదే స్ఫూర్తిగా, దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, ప్రతీ ఒక్కరికీ సమానమైన విద్య, అవకాశాలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ ‘రిజర్వేషన్స్ హటావో ఆందోళన్’ పేజీ పుట్టుకొచ్చింది.దీనికి గంటల్లోనే 34 లక్షలకుపైగా ఫాలోవర్లు వచ్చారు. 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' (RHA) ప్రతినిధులు స్పందిస్తూ.. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని పేర్కొన్నారు.ఇది ఏ రకమైన రాజకీయ ప్రాతిపదికన నడిచేది కాదని పేర్కొన్నారు.
చట్టాల్లో, ప్రభుత్వ నిబంధనల్లో ఎక్కడా కులం (క్యాస్ట్) ప్రస్తావన లేకుండా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టంచేశారు. విద్య, ఉద్యోగ అవకాశాలలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ అందరికీ సమాన ప్రాతిపదికన ఫలాలు అందేలా చట్ట సవరణలు చేయాలని ఆర్‌హెచ్ఏ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.












