పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతూ కేంద్రం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది.అయితే, ప్రతిపక్షాలు కేంద్రానికి ఝలక్ ఇచ్చాయి. అఖిలపక్ష భేటీని బహిష్కరించాయి. దీనికి ప్రభుత్వ వైఖరే కారణమంటూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేశాయి. ఇండియా కూటమిలోని ఎంపీలు అందరూ ఈ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాయి.
అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నీట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంట్‌లో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనికి తోడు లడఖ్‌కు స్పెషల్ స్టేటస్ కోరుతూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరసనలు, అయోధ్య రామాలయం పరిసరాల్లో కురిసిన వర్షాలకు రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతినడం, విరాళాల చోరీ వంటి కీలక అంశాలను ఎజెండాగా మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే, కేంద్రం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్లకు అంగీకరించలేదని తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తూ ‘ఇండియా’ కూటమి పక్ష నేతలంతా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా, రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో పలు కీలక బిల్లులకు ఆమోదం, సంచలన నిర్ణయాలకు కేంద్రం తెరలేపనుందని దేశరాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సెషన్‌లోనే డీ లిమిటేషన్ బిల్లు పెడతారని కూడా సమాచారం.












