National

Maharashtra: ఉద్ధవ్‎కు బిగ్ షాక్.. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

బాలాసాహెబ్ థాక్రే స్థాపించిన శివసేన.. ఎన్నో దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసింది. కానీ బాలాసాహెబ్ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే హయాంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

మహారాష్ట్ర రాజకీయాలు అంటేనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయన్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు శివసేనకు తిరుగులేని నాయకుడిగా నిలిచిన ఉద్ధవ్ థాక్రేకు ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులు కేవలం సంఖ్యాపరమైన నష్టం మాత్రమే కాదు.. రాజకీయంగా కూడా మరో పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

బాలాసాహెబ్ థాక్రే స్థాపించిన శివసేన.. ఎన్నో దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసింది. కానీ బాలాసాహెబ్ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే హయాంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో విభేదించి.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది.

ఈ క్రమంలో హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి అధికార రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు మొదలయ్యాయి. ఆ అసంతృప్తే ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుకు బలమైన కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.. 2022లో ఎమ్మెల్యేల మెజారిటీని తనవైపు తిప్పుకున్న షిండే ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్నికల సంఘం నుంచి అసలు శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కూడా దక్కించుకున్నారు. అది ఉద్ధవ్ థాక్రేకు తగిలిన మొదటి రాజకీయ దెబ్బ.

ఆ తర్వాత కూడా పరిస్థితులు చక్కబడతాయని ఉద్ధవ్ వర్గం భావించినా.. వరుసగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతూనే ఉన్నారు. ఇప్పుడు లోక్‌సభలో యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడం.. ఆ విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపడం మరో కీలక మలుపుగా మారింది.

మొత్తం తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు షిండే వర్గంలోకి వెళ్లడంతో.. మూడింట రెండొంతుల నిబంధన కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వీరిపై వర్తించలేదు. దీంతో ఉద్ధవ్ వర్గం అనర్హత పిటిషన్ ఆశలు కూడా వదలుకోవలసి వచ్చింది. . స్పీకర్ నిర్ణయంతో లోక్‌సభలో ఉద్ధవ్ వర్గం బలం కేవలం ముగ్గురు ఎంపీలకు పరిమితమైంది. మరోవైపు షిండే శివసేన బలం 13కు చేరింది.

మరోవైపు షిండే శివసేన ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. లోక్‌సభలో ప్రతి ఓటు కీలకంగా మారుతున్న సమయంలో.. మిత్రపక్షాల బలం పెరగడం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యూహాత్మకంగా లాభించే అంశంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్ వంటి కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సంఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఉద్ధవ్ థాక్రే పార్టీ పేరు కోల్పోయారు.. ఎన్నికల గుర్తు కోల్పోయారు.. ఎమ్మెల్యేల మెజారిటీ కోల్పోయారు.. ఇప్పుడు ఎంపీల్లో కూడా అధిక సంఖ్యను కోల్పోయారు. అయినప్పటికీ ఆయన ఇంకా బాలాసాహెబ్ అసలైన వారసత్వం మా దగ్గరే ఉంది అనే భావోద్వేగ రాజకీయాలతో ప్రజల్లో నిలబడే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన తీరు ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగామారి పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఉద్ధవ్ థాక్రే మరోసారి తన పార్టీని బలోపేతం చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో పునరాగమనం చేస్తారా? లేక ఏక్‌నాథ్ షిండేనే శివసేనకు శాశ్వత రాజకీయ నేతగా నిలుస్తారా? అనే సందేహాలను రేకెత్తిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న ఎన్నికలే సమాధానంగా నిలుస్తాయని భావిస్తున్నారు.

#Maharashtra#politics#Shiv Sena#UBT chief Uddhav Thackeray#Big shock#Uddhav
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి