పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారతీయులు గత కొంతకాలంగా ఎల్‌పీజీ ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. దేశ ప్రజలకు వంట గ్యాస్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దిగుమతులను పెంచింది. దేశీయంగాను బయోగ్యాస్ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది.
ఇదిలాఉండగా, గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మరో శుభవార్త చెప్పింది.తమ కస్టమర్లకు సరికొత్త వంటగ్యాస్ అనుభూతిని అందించేందుకు 'భారత్‌గ్యాస్ లైట్ జిప్' పేరిట నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం ఎల్పీజీ సేవలను ప్రారంభించింది. అతి తక్కువ డాక్యుమెంటేషన్, తక్షణ కొత్త కనెక్షన్, చాలా వేగంగా సిలిండర్ ఇంటికి డెలివరీ అయ్యేలా ఎక్స్‌ప్రెస్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, తక్కువ సమయంలో గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే వినియోగదారుల కోసం ఈ ప్రీమియం సేవలను డిజైన్ చేసినట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పేర్కొన్నారు. 'భారత్‌గ్యాస్ లైట్' కాంపోజిట్ సిలిండర్ సాధారణ ఇనుప సిలిండర్ల కంటే 50 శాతం తక్కువ బరువు కలిగి ఉంటుంది. దీంతో సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. సిలిండర్ బాడీ ప్లాస్టింగ్ తరహా ఉండటంతో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయట నుంచి స్పష్టంగా చూసుకునే వీలుంటుంది. ఇది తుప్పు పట్టదు.
పేలుడు నిరోధక సాంకేతికతతో తయారుచేసింది. ప్రస్తుతం ముంబైలో ప్రారంభమైన ఈ సేవలను ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో గల మరో 100 ప్రధాన నగరాలకు వేగంగా విస్తరించాలని బీపీసీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.కాగా, ఇండియన్ గ్యాస్‌లో ఇప్పటికే ఈ తరహా సేవలు అందుతున్నాయి.












