దేశంలో మరో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. నిషేధిత పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ నెట్‌వర్క్‌తో సంబంధాలు పెట్టుకుని.. యువతను టెర్రరిజం వైపు నడిపిస్తున్న ఐదుగురు నిందితులను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఐదుగురిలో గుజరాత్ రాష్ట్రం భరూచ్‌లోని ఓ మదర్సాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌ల ద్వారా పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మహమ్మద్ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇండియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం, యువతను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద మార్గంలోకి రిక్రూట్ చేయడమే టార్గెట్‌గా వారు పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు వీరు ఎవరెవరితో టచ్‌లోకి వెళ్లారు? అనేదానిపైనా పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.
గుజరాత్‌లోని భరూచ్ మదర్సాలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులను కూడా ఈ ఉగ్ర ముఠా బుట్టలో వేసుకున్నట్టు తెలిసింది.వారికి జిహాదీ భావజాలాన్ని నూరిపోసినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతో పాటు తీవ్రవాద కరపత్రాలను సీజ్ చేశారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












