హైదరాబాద్.. వేగంగా విస్తరిస్తున్న మహానగరం. ఒకవైపు ఎత్తైన భవనాలు... మరోవైపు కాంక్రీట్ అడవులు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చదనం కాపాడటం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు అదే సవాలును అవకాశంగా మార్చే దిశగా హెచ్‌ఎండీఏ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది.
ఈ ఏడాది నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమం కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా.. నగర జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్యమంగా మార్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.300 కోట్ల నిధులను కేటాయించడం ఈ ప్రణాళికకు ఉన్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 11,258 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పెద్ద పార్కులు, ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. కానీ ఈసారి కాలనీల మధ్యలో ఉండే చిన్న చిన్న పార్కులపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో చిన్న, పెద్ద పార్కులు 450కు పైగా ఉన్నాయి. వీటిలో ఒక ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న 200 కాలనీ పార్కులను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో మొదటి దశలో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని 100 పార్కులను ఎంపిక చేసి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. కాలనీ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అధికారులను సంప్రదిస్తే.. ఆయా పార్కులను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొంటున్నారు.
మరోవైపు కాలనీల్లో మరింత పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకునే స్థానిక సంఘాలు ముందుకు వస్తే ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ నర్సరీల్లో ఇప్పటికే వేలాది మొక్కలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కాగా ఈ ప్రణాళిక విజయవంతమైతే.. పిల్లలకు సురక్షితమైన ఆట స్థలాలు, వృద్ధులకు ఆహ్లాదకరమైన వాకింగ్ ప్రదేశాలు, మహిళలకు ప్రశాంతమైన విశ్రాంతి వాతావరణం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల కాలుష్యం తగ్గడం, ఉష్ణోగ్రతలు కొంత మేర నియంత్రణలో ఉండటం, భూగర్భ జలాల పరిరక్షణకు కూడా ఇవి దోహదపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. కానీ కేవలం ప్రణాళికలు ప్రకటించడం ఒక్కటే సరిపోదు. గతంలో కూడా అనేక పార్కులు అభివృద్ధి చేసిన తర్వాత నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అభివృద్ధితో పాటు.. నిర్వహణ, భద్రత, నీటి సరఫరా, మొక్కల సంరక్షణ వంటి అంశాలపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
అలాగే స్థానిక ప్రజలు కూడా ఈ పార్కులను తమ సొంత ఆస్తిలా భావించి సంరక్షిస్తేనే ఈ ప్రయత్నం నిజమైన ఫలితాన్ని ఇస్తుందని గుర్తించాలి. మొత్తానికి.. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌కు పచ్చదనం అందించాలనే లక్ష్యంతో హెచ్‌ఎండీఏ రూపొందించిన ఈ ప్రణాళిక విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో నగరం మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మారే అవకాశం ఉంది..












