రాజకీయాల్లో విమర్శలు సర్వ సాధారణమే అయినప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఆరని చిచ్చులా నిత్యం ఏదో ఒక అంశం పై మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరిగా ఉద్యోగాల భర్తీ జరగలేదని.. కానీ కేటీఆర్ మాత్రం తమ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ జరిగినట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..
ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదు. అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం అన్ని అవకాశాలు దక్కాయి అంటూ ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
మీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజల ముందు లెక్కలు చెప్పండని ఈ సందర్భంగా కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించిదని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని కౌంటర్ ఇచ్చిన మహేశ్‌కుమార్ గౌడ్.. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారో సమాధానం చెప్పాలని కేటీఆర్ ను ప్రశ్నించారు..












