పూరి జగన్నాథ రథయాత్ర మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. అలంకార ప్రియుడిగా భక్తులు భావించే శ్రీ జగన్నాథుడి పొహండి సేవలో అత్యంత కీలకమైన పుష్పాల కిరీటం 'టహియా' లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది సంప్రదాయానికి విరుద్ధమని, సేవల్లో నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ప్రస్తావిస్తున్నాయి. గతేడాది రథయాత్రలో జరిగిన అపశ్రుతులు, తొక్కిసలాటలో భక్తుల ప్రాణనష్టం ఇప్పటికీ మరువలేదని, ఈసారి కూడా ఇద్దరు భక్తులు మృతి చెందడం, వంద మందికి పైగా గాయపడడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియచేస్తుందని బిజేడీ నేత ప్రమీలా మల్లిక్ ఆరోపించారు.
మరోవైపు, కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై మండిపడింది. రథయాత్రకు నాలుగు నెలల ముందే ఏర్పాట్లు ప్రారంభించామని చెప్పిన ప్రభుత్వం, భక్తుల భద్రతతో పాటు సంప్రదాయాల పరిరక్షణలో కూడా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ విమర్శించారు. భక్తుల విశ్వాసం, శతాబ్దాల సంప్రదాయాలు, భద్రత.. ఈ మూడు అంశాల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద వివాదంగా మారుతుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
ఇక రథయాత్రలో ముఖ్య ఆకర్షణ పురుషోత్తముడి ‘టహియా’ శిరస్సుపై ఆ కిరీటాన్ని ధరించిన అనంతరం వెలుపలకు వచ్చే స్వామి దివ్య మంగళరూపం తిలకించేందుకు భక్తులు ఎదురు చూస్తారు. అయితే వదలకుండా వర్షం కురుస్తుండటంతో ఆలయంలోని 22 మెట్లు మీదుగా స్వామిని తీసుకొస్తున్న సమయంలో టహియా తెగిపడటంతో తొలగించాల్సి వచ్చిందని జగన్నాథుని ప్రధాన దైతాపతి సేవాయత్ రామకృష్ణదాస్ మహాపాత్ర్ తెలిపారు. ఈ కారణంగా భక్తుల రద్దీ నడుమ విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్లలే కపోయామన్నారు.
మరోవైపు యాత్రలో స్వల్ప ఇబ్బందులు తప్పవని, రథాలు కదలకుండా నిలిచిపోయిన ఘటనలెన్నో ఉన్నాయని శ్రీక్షేత్ర పాలనాధికారి అరవిందపాఢి పేర్కొన్నారు. ఈ యాత్రపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఇందులో యంత్రాంగం జోక్యం ఉండదని.. నిర్ణీత వేళల్లో సేవలన్నీ పూర్తిచేసిన సేవాయత్‌లు కీలకమైన జగన్నాథుని వేడుక సమయంలో అలక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇది రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు..












