పరిపూర్ణ భక్తిని సాధించిన సాధకునికి పరిసరాలతో గాని పరులతోగాని బాంధవ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. తన ప్రపంచం మొత్తం భగవంతుని చుట్టే అల్లుకోబడి ఉంటుంది. భక్తి సాధనలో తనను తాను మైమరచి అను నిత్యం ఆధ్యాత్మిక చింతనలో జీవిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి..
అందుకే భక్తికి పరాకాష్ట ఆత్మనివేదనం అనే అర్థాన్ని తెలుపుచున్నాయి. ఇక ఆత్మనివేదనము అంటే పరిపూర్ణ శరణాగతి. తనని తాను పూర్తిగా అంటే మనసా,వాచా, కర్మణా సమర్పించుకుని భగవంతుని నుంచి ఏమీ ఆశించకుండా ఉండటం.. తన చుట్టూ గాని కళ్లముందుగాని ఏది జరిగినా ప్రశాంత మనస్సుతో భగవంతునికి కృతజ్ఞతలు సమర్పించడమే. వచ్చే ఫలితాన్ని వినయంగా స్వీకరించడమే. అంతే కాకుండా ఆత్మనివేదనములో భగవంతుడు, భక్తుడు ఒక్కటైపోతారట..
అప్పుడు ఆ భక్తుడు భగవంతునిలో లీనమై దైవమయమైపోతాడట. స్వామి మాటల్లో శరణాగతి అంటే మూడు రకములు. "నేను నీవాడిని, నీవు నా వాడివి" , "నీవే నేను" , "నేనే నీవు''.. ''నీవే నేను" అన్నది ఆత్మనివేదనములో చివరిదని పండితులు చెబుతున్నారు. ఈ స్ధితికి చేరుకోవడం ఎలాగంటే?.. దారిలోనున్న అతి కష్టమైన "సందేహం" అనే బండరాళ్ళు, 'అహం, మమకారం' అనే ముళ్ళ కంచెలు దాటితేనే గమ్యం చేరగలమని వివరిస్తున్నారు.
అలాగే విమర్శలనే తుఫానులు, అవమానాలనే సుడిగుండాలను ఎదుర్కొంటేనే భక్తి అనే నావ.. ఆత్మనివేదనం అనే తీరానికి చేరుకుంటుందని, భక్తికి పరాకాష్ట అయిన ఈ దశలో సాధకుడు భగవంతుని యందు సంపూర్ణ శరణాగతి భావములో సర్వము భగత్సంకల్పమునకు విడిచి పెట్టి తన్నుతాను భగవంతునికి అర్పించుకొనే స్థితికి చేరుకుంటాడని ఈ స్థితినే ఆత్మనివేదనం అంటారని తెలియచేస్తున్నారు.
భగవంతుడా! నాదన్నది ఏమున్నది ఈ లోకంలో ? సర్వము నీదే!" అనే ఆత్మార్పిత భావముతో తనను తాను అర్పితము గావించుకున్న బలి చక్రవర్తి ఇందుకు చక్కని ఉదాహరణ. ఇకపోతే పుట్టెటప్పుడు ఏమి తీసుకురాం, కాని పోయేటప్పుడు మాత్రం మంచిచెడులు మూటకట్టుకుపోతాం. ఇవే మానవుని వెంటవచ్చే ధనధాన్యాలు. అందుకే భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి చేసిన వారికి మోక్షమే తోడుగా ఉంటుందని, మంచి, చెడు కర్మల బంధాలు వారిని అనుసరించవని పురాణాలలో చెప్పబడినట్టు పండితులు వెల్లడిస్తున్నారు..












