తెలంగాణ

Bhadrachalam: భద్రాద్రిపై ప్రత్యేక దృష్టి.. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి..!

రచన: Venu4 నిమిషాల పఠనం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వామి, అమ్మవార్లకు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి.. అనంతరం పండితుల నుంచి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

మరోవైపు భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే, ప్రతి ఏటా గోదావరి వరదల వల్ల భద్రాచలం పట్టణ ప్రజలు, భక్తులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా గోదావరి కరకట్ట విస్తరణ, ఆధునీకరణ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

అలాగే ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. భక్తుల వసతి సౌకర్యాలు, క్యూలైన్ల ఆధునీకరణ, అన్నదాన సత్రాల విస్తరణ, పార్కింగ్ సదుపాయాల మెరుగుదల కోసం ప్రత్యేక నిధులను కేటాయించింది. కేవలం ఆలయ పరిసరాలే కాకుండా, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల రోడ్ల అనుసంధానానికి, మౌలిక వసతుల కల్పనకు సైతం రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేస్తోంది.

ఇక క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లుతో కలిసి రాబోయే రోజుల్లో భద్రాచలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి రామయ్య క్షేత్రం సరికొత్త వైభవాన్ని సంతరించుకోబోతోందని ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైంది.

#Telangana#Khammam#Ponguleti Srinivasa Reddy#visited#Lord Sri Sitaramachandra Swamy#Bhadrachalam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి