ఆధునిక జీవనశైలిలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు
గంటల కొద్దీ కూర్చుంటే ప్రాణాంతక రోగాలు!
డెస్క్ జాబ్స్ సంస్కృతితో తీవ్ర అనారోగ్య సమస్యలు
పెరుగుతున్న గుండె జబ్బులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు
నడుము, మెడ నొప్పి, మానసిక ఒత్తిళ్లతో నిశ్చల జీవనం
తగు నియమాలు పాటించాలంటున్న వైద్య నిపుణులు
శారీరక శ్రమను దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణుల సూచన
ప్రస్తుత ఆధునిక కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు వివిధ ఆఫీసు ఉద్యోగాల్లో గంటల తరబడి కుర్చీలకే పరిమితమయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజంతా కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల శరీరానికి అసలు శ్రమ లేకుండా పోతోంది. ఈ నిశ్చల జీవనశైలి నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తూ, ఊహించని రోగాలను కొనితెస్తోంది. ఒకప్పుడు కేవలం వృద్ధుల్లోనే కనిపించే ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే యువతలోనూ సర్వసాధారణంగా మారిపోతున్నాయి.
ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. ఇది ప్రాథమికంగా తీవ్రమైన నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులతో మొదలవుతుంది. అంతటితో ఆగకుండా శరీరంలో క్యాలరీలు కరగకపోవడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఈ ఊబకాయం కాస్తా కాలక్రమేణా టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు (బీపీ), గుండె జబ్బులకు దారితీస్తుంది. శరీర కదలికలు లేకపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, గుండెపోటు వచ్చే అవకాశాలు 50 శాతానికి పైగా పెరుగుతాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
గంటల కొద్దీ సీటుకే పరిమితమవడం కేవలం శారీరక రుగ్మతలకే కాదు, మానసిక సమస్యలకు కూడా ప్రధాన కారణంగా మారుతోంది. నిరంతరం ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల మెదడుకు అందే ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, త్వరగా అలసట వస్తుంది. దీనివల్ల పనిపై దృష్టి పెట్టలేకపోవడం, విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, తీవ్రమైన నిరాశ లేదా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, శారీరక శ్రమ లేకపోవడం వల్ల రాత్రి పూట సరైన నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
నియంత్రణ మార్గాలు
ఈ సమస్యల బారిన పడకుండా ఉండటానికి ఉద్యోగాలను వదిలేయాల్సిన పని లేదు, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసులో పని చేసేటప్పుడు ప్రతీ 45 నిమిషాల నుంచి ఒక గంటకు ఒకసారి సీట్లో నుంచి లేచి కనీసం 5 నిమిషాల పాటు అటు ఇటు నడవాలి. దీనిని 'యాక్టివ్ బ్రేక్' అంటారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చోకుండా నడుస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే కూర్చునే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వెన్నునొప్పి సమస్యను నివారించవచ్చు.
దినచర్యలో మార్పులతోనే సంపూర్ణ ఆరోగ్యం
ఆఫీస్ వేళల వెలుపల కూడా శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా, సైక్లింగ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. లిఫ్ట్‌లకు బదులు వీలైనంత వరకు మెట్లు ఎక్కాలి. పని మధ్యలో కళ్లపై ఒత్తిడి తగ్గించుకోవడానికి 20-20-20 సూత్రాన్ని పాటించాలి (ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం). జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులే మిమ్మల్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.












