రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు స్టేట్ పార్టీ ఇన్‌చార్జి అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మీడియాకు వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో బీజేపీలో ఊహించని మార్పులు చోటుచేసుకోనున్నాయని స్పష్టంచేశారు.వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీని కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం బీజేపీలో ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా నాయకుల వ్యవహార శైలి ఉండగా.. నేతల మధ్య సమన్వయం పెంచడానికి, వ్యక్తిగత పోరును వదిలి పార్టీ కోసం పనిచేయాలని అభయ్ పాటిల్ కీలక నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా తాము త్వరలోనే డోర్స్ ఓపెన్ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏ పార్టీల నుంచి ఎవరెవరు బీజేపీలోకి వస్తారో అంతా చూస్తారని అభయ్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు.
నిన్న పార్టీ సీనియర్ నేతలు కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య జరిగిన భేటీపై మీడియా ప్రశ్నించగా.. అభియ్ పాటిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వారిద్దరి సమావేశం ప్రత్యేకమైనదేమీ కాదన్నారు. రానున్న రోజుల్లో అలాంటి ఊహించని సమావేశాలు చాలానే చోటుచేసుకుంటాయని తెలిపారు. బీజేపీ జాతీయ నాయకత్వం, తమ అధినేత నితిన్ నబీన్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, వ్యూహాలతోనే తాను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వర్క్ అవుట్ ప్రారంభించినట్టు తెలిపారు. అభయ్ పాటిల్ వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తుండగా.. ఉండేదెవరు? పోయేదెవరు? కొత్తగా వచ్చేదెవరు? అనే చర్చ పార్టీలో మొదలైంది.












