కూటమి పార్టీల మధ్య స్థానిక ఎన్నికల సమరం
లోకల్‌లో పట్టు నిలుపుకునేందుకు జనసేన ప్రయత్నాలు
2024 ఫార్ములానే కొనసాగుతుందంటున్న టీడీపీ
ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందే అంటున్న జనసైనికులు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి చరిత్ర సూపర్ హిట్. 2024 ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో.. అనూహ్యమైన విజయం దక్కింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్లే వైసీపీ ఓడిపోయిందన్నది అందరూ చెప్పే మాట. ఐతే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు ఈ పార్టీల మధ్య పరీక్ష పెట్టనున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కావాలని జనసేన పట్టు పడుతుండడమే దీనికి కారణం. వైసీపీని తట్టుకొని నిలబడాలంటే.. కూటమి కొనసాగాల్సిందేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో స్థానికంగా బలపడేందుకు జన సైనికులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య లోకల్ ఫైట్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది.
80 శాతం సీట్లు టీడీపీవేనా..?
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సాధారణ ఎన్నికల తరహాలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలతో మాట్లాడే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట. టీడీపీకి ఎనభై శాతం, జనసేనకు పదిహేను శాతం, బీజేపీకి ఐదు శాతం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇస్తామని చెప్పడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది పార్టీ అంతర్గత సమావేశాల్లో లోకేష్ చేసిన ప్రకటన. అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోకేష్ మాటలు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చకు దారి తీశాయి. ఈ విషయం జనసేన నాయకుల్లో చేవుల్లో కూడా పడింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్రు మీదున్నారని తెలుస్తోంది.
ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగాల్సిందేనని వారంతా పార్టీ అధినేత పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారట. సార్వత్రిక ఎన్నికల్లాగే తక్కువ సీట్లలో పోటీ చేస్తే... భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారట. ఈ క్రమంలో పవన్ రంగంలోకి దిగి చర్చలు జరపాల్సిందేననే వాదన పార్టీలో వినిపిస్తోంది. అప్పుడంటే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గామని, ఇప్పుడు కూడా అదే ఫార్ములా అంటే ఎలా కుదురుతుందని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఆ లెక్కలేం కుదరవు: మంత్రి నాదెండ్ల
ఇదే సమయంలో మంత్రి, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి బలం ఉన్న ప్రతి చోటా తాము తప్పకుండా పోటీ చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఓట్ల చీలకూడదన్న కారణంతో తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇచ్చిన మాట కోసం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి నిలబడ్డారని గుర్తు చేశారు.
అప్పటి పరిస్థితుల్లో కూటమిని బలోపేతం చేయడం కోసమే జనసైనికులు నాలుగు అడుగులు వెనక్కి వేశారని అన్నారు నాదెండ్ల. అయితే, సార్వత్రిక ఎన్నికల నాటి ఆ ఫార్ములా ఇప్పుడు వర్తించదని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గుతామని అనుకుంటే పొరపాటని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడి పనిచేసిన జనసైనికులకు ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే, జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ నుంచి స్థానిక సమరం
ఏపీలో సెప్టెంబర్ నుంచి లోకల్ వార్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబర్ నెలలో నగరపాలక ఎన్నికలను పూర్తి చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఆ వెంటనే అక్టోబర్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చివరి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది.
ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకాలపై ఇప్పటి నుంచే పార్టీల మధ్య ఫైటింగ్ మొదలైంది. కూటమిలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన నాయకుల నుంచి భిన్నమైన ప్రకటనలు వస్తుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఐతే త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమై ఓ ఫార్ములాను ఫైనల్ చేయొచ్చని తెలుస్తోంది.












