రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామం ఒక్కసారిగా పోలీసుల సరెండర్‌లోకి వెళ్లిపోయింది. గత కొన్ని రోజులుగా భూముల విషయమై ఆందోళన బాట పట్టిన స్థానిక రైతుల నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు అర్ధరాత్రి భారీ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వందలాది మంది పోలీసు బలగాలు ఏకకాలంలో గ్రామంలోకి ప్రవేశించి, ఇక్కడి వాతావరణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత, భయాందోళనలు నెలకొన్నాయి.
తమ భూములను కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరాలపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న నిరసనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి వేరే ప్రాంతాలకు తరలించారు. రైతులు వేసుకున్న టెంట్లను, నిరసన సామగ్రిని రాత్రికి రాత్రే పూర్తిగా తొలగించారు. తెల్లవారేసరికి ధర్నా చౌక్ ప్రాంతం మొత్తం ఖాళీ చేసి, ఎవరూ తిరిగి రాకుండా ఆ ప్రాంతాన్ని క్లియర్ చేశారు.
ఒకవైపు రైతులను అదుపులోకి తీసుకుంటూనే, మరోవైపు హైడ్రా (HYDRAA) అధికారులు రంగంలోకి దిగి తమ పని పూర్తి చేశారు. బహదూర్‌గూడ గ్రామంలోని రైతులకు చెందిన సుమారు 650 ఎకరాల భూమిని ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. చీకట్లోనే భారీ యంత్రాలతో సదరు 650 ఎకరాల భూమి చుట్టూ చకచకా ఫెన్సింగ్ (కంచె) వేసి బోర్డులను పాతారు. రైతులెవరూ భూముల్లోకి రాకుండా హైడ్రా యంత్రాంగం ఆ భూమిని పూర్తిగా నిర్బంధంలోకి తీసుకుంది.
ప్రస్తుతం బహదూర్‌గూడ గ్రామం పూర్తిగా పోలీసుల నిఘా నీడలో ఉంది. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు గ్రామ సరిహద్దుల వద్ద భారీగా పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. బయటి ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు, రైతు సంఘాల నేతలు ఎవరూ బహదూర్‌గూడలోకి రాకుండా గస్తీని ముమ్మరం చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానిక రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.












