రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈహెచ్ఎస్(ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) (EHS) మీద పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇలాంటి స్కీమ్ ఎందుకు తెచ్చారు? దీని వలన ఎవరికి ఉపయోగం అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రయివేట్, లిస్టెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ సైతం సర్కారు కొత్తగా తెచ్చిన హెల్త్ స్కీంలో వైద్య చికిత్సల కోసం మెన్షన్ చేసిన రుసుముపై పెదవి విరుస్తున్నాయి. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ప్రతినిధుల బృందం(‘టన్హా’) ప్రతినిధులు సైతం ఆరోగ్య శ్రీ పథకం సీఈవోను కలిసి వినతి పత్రం అందచేశారు.
చికిత్సల కోసం సఫారసు చేసిన ధరల పట్టికను సవరించాలని కోరారు. లేదంటే వైద్యసేవలు అందించబోమని హెచ్చరికలు పంపారు. అయితే, నగదు రహిత సేవల కోసం తెచ్చిన హెల్త్ స్కీం మీద తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం మండిపడుతున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ద్వారా సాధారణ వైద్య సేవలు మినహా సర్జరీలు ఎలా సాధ్యం అంటూ ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో దీని మీద పెద్దఎత్తున చర్చ చేస్తున్నారు.
తాజాగా ఆ చాట్స్ బయటకు వచ్చాయి. ‘మన జీతం నుంచి కోత పెట్టి, మనకే వైద్యం అందించడం ఏంటి?. కొన్ని చికిత్సలకు కేవలం రూ.2 లక్షలే పరిమితి పెట్టడం ఏంటి? ఈ రోజుల్లో ఆ డబ్బులు సర్జరీకి కూడా సరిపోవు కదా?. మన వాటా 1.5 శాతం, ప్రభుత్వ వాటా 1.5 శాతం కలిపితే ప్రైవేట్ సంస్థల్లో చాలా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు దొరుకుతాయి.మన డబ్బులు తీసుకుని మనకే సరైన వైద్యం అందించని EHS పథకం.. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉందంటూ’ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అసలు ఉద్యోగ సంఘాలు కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నాయి? ఈ విధానాన్ని ఎందుకు అంగీకరించారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.












