కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత కొట్లాటలు కాస్త తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు పదవుల కోసం మొదలైన పోటీ ఇప్పుడు రీవెంజ్ వరకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తున్నది. ముందుగా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను సదరు కాంగ్రెస్ కార్యకర్త మీద పోసి రౌడీషీటర్ నిప్పంటించినట్టు తెలిసింది.
వివరాల్లోకివెళితే.. వర్ధన్నపేట నియోజకవర్గం గీసుగొండ మండలం కోటిలింగాల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్‌పై పత్తి కుమార్ అనే రౌడీషీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతకుముందు జున్ను మధు అనే కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేసి పిలవడంతో అక్కడకు వెళ్లినట్టు బాధిత వ్యక్తి మహేశ్ పేర్కొన్నాడు. ‘నా గురించి ఎమ్మెల్యేకి ఏం చెప్పావు?’ అంటూ కోపంతో పత్తి కుమార్ తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని బాధితుడు వెల్లడించాడు.
https://x.com/TeluguScribe/status/2078718655383412882?s=20
జీవిత ఖైదు పడిన రౌడీషీటర్ బయటకు ఎలా వచ్చాడంటూ బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహేశ్‌ను ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఒళ్లంతా కాలిన గాయాలతోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. వీరిద్దరి మధ్య ఏమైనా పాత గొడవలు ఉన్నాయా? లేదా పొలిటికల్ పంచాయితీనా? అనేది తెలియాల్సి ఉన్నది. కాగా, నిందితుడు పత్తి కుమార్ ఓ కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. జీవిత ఖైదు పడిన అతను బయటకు ఎలా వచ్చాడు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.












