నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్టు(NEET)లో నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సత్తా చాటారు. చదువుకు పేదరికం అడ్డంకి కాదని వీళ్లు మరోసారి నిరూపించారు. దీంతో వారి పేర్లు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. రెండ్రోజుల కిందట విడుదలైన నీట్ యూజీ రీగ్జామ్ ఫలితాల్లో అక్కాచెళ్లెళ్లు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన కమ్మరి వైష్ణవి, కమ్మరి రక్షిత నీట్-2026 ఫలితాల్లో ప్రతిభ చాటారు.నీట్ యూజీ రీ ఎగ్జామ్‌లో ఇద్దరు సోదరీమణులు 720 మార్కులకు గానూ చెరో 514 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు.
నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ, పట్టుదలతో చదివి వైద్య సీటు సాధించే దిశగా అడుగులు వేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఘనత సాధించిన విద్యార్థినులను గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్‌లో డాక్టర్లు అయ్యి పేదలకు సేవ చేయడమే తమ కోరిక అని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు.
https://x.com/RTVnewsnetwork/status/2078643018702414167?s=20
ఇదిలాఉండగా, నీట్ పేపర్ లీకేజీ కారణంగా గతంలో నిర్వహించిన ప్రవేశపరీక్షలను ఎన్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరోసారి పరీక్ష నిర్వహించగా.. శుక్రవారం నీట్ యూజీ రీగ్జామ్ ఫలితాలు వెలువడగా.. పరీక్షల్లో మహిళలే పైచేయి సాధించారు. మొత్తంగా ఈ పరీక్షకు 20 లక్షల మంది హాజరవ్వగా.. 11 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది.












