సోమవారం నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ఈసారి వాడీ వేడిగా సాగనున్న సెషన్స్
ఢీ అంటే ఢీ అంటున్న ఎన్డీయే, ఇండి కూటములు
ఆల్ పార్టీ మీటింగ్ నుంచి విపక్షాల వాకౌట్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి. రేపటి నుంచి మొదలయ్యే సమావేశాలకు ఎన్డీయే, ఇండి కూటమి పక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఉభయ సభల్లో ఎన్డీయే బలం పెరిగింది. ఈ క్రమంలో కొన్ని కీలక బిల్లులను పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎలాగైనా బిల్లులను గట్టెక్కించుకోవాలనే వ్యూహంలో ఎన్డీయే ఉంది. వాటిని అడ్డుకునేందుకు ఇండి కూటమి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి.
ఆల్ పార్టీ మీటింగ్ నుంచి విపక్షాలు వాకౌట్
అఖిలపక్ష సమావేశం కూడా వాడీ వేడిగా సాగింది. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది ప్రభుత్వం. ఈ సమయంలో విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. పార్లమెంటు సమావేశాల్లో పారదర్శకత ఉండాల్సిందేనని కోరాయి. ఆల్ పార్టీ మీటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలను ఆహ్వానించడాన్ని ఇండి కూటమి పార్టీలు తప్పుపట్టాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కూటమి ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఆల్ పార్టీ మీటింగే ఈ రేంజ్‌లో జరగడంతో.. పార్లమెంటు సమావేశాలు ఇంకా ఎలా సాగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
సభను కుదిపేయనున్న శనివారం ఎపిసోడ్స్
శనివారం జరిగిన రెండు కీలక పరిణామాలు పార్లమెంటును కుదిపేయనున్నాయి. కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు సామాజికవేత్త సోనం వాంగ్‌చుక్. ఆయన దీక్షను ఢిల్లీ పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఆ వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే దీక్షను మొదలుపెట్టారు. ఈ అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విపక్ష పార్టీలు వాంగ్‌చుక్ ఎపిసోడ్‌ను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమయ్యేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఇది కూడా ఇండియా కూటమి పార్టీలకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీనిపై కూడా కేంద్రాన్ని టార్గెట్ చేసేందుకు ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అఖిలపక్షానికి టీఎంసీ రెబల్ ఎంపీలను పిలవడాన్ని ఇప్పటికే తప్పుపడుతున్నాయి. ఈ అంశాలన్నీ సభలో వేడి పుట్టించే అవకాశం ఉంది. సమావేశాలు మొదలయ్యే రోజే.. మార్చ్ టు పార్లమెంట్ అంటూ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.
ఎవరి వ్యూహాలు వారివే
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఇంకా ఎజెండాలో చేర్చలేదు కేంద్రం. ప్రతిష్ఠాత్మకమైన బిల్లుపై సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు అధికార కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టాలని విపక్ష కూటమి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు కూటముల మధ్య నెంబర్ గేమ్ నడుస్తోంది. ఇండి కూటమితో తెగదెంపులు చేసుకున్న డీఎంకే తమకు విడిగా సీట్లు కేటాయించాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరింది. తృణమూల్ నుంచి విడిపోయి ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ లో చేరినట్లు ప్రకటించిన 20 మంది ఎంపీలు తమకు విడిగా సీట్లు కేటాయించాలని చేసిన అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు.
కుదిపేయనున్న అయోధ్య విరాళాల అంశం
అయోధ్య ఆలయంలో విరాళాల చోరీ అంశాన్ని బలంగా లేవనెత్తేందుకు ఇండి కూటమిలోని పక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసేదాకా సభలను స్తంభింపజేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. త్వరలోనే యూపీ ఎన్నికలు కూడా ఉండడంతో.. ఈ అంశం అధికార, విపక్షాల మధ్య పెద్ద యుద్ధానికే దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయోధ్య రామమందిరం బీజేపీ నినాదం కావడంతో, అక్కడే అధికార పార్టీని కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.
సభ ముందుకు మరికొన్ని అంశాలు
విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ, వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు వంటివి ఈసారి సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ప్రశ్న పత్రాల లీకేజీ, పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం, విదేశాంగ విధానం వంటివీ సమావేశాలను కుదిపేయవచ్చని భావిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షం పట్టుపట్టనుంది. ఈ అంశాలన్నీ కలిసి పార్లమెంటు సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.












