Honey Trap: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక ఆఫీసర్ పాకిస్తాన్ మహిళ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. అంతేకాదు డిఫెన్స్ సీక్రెట్స్ సైతం ఆయన లీక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సదురు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వింగ్ కమాండర్ కు సోషల్ మీడియాలో పాక్ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత ఆమెతో నిత్యం వీడియో కాల్స్ మాట్లాడే వాడు. డిఫెన్స్ కు సంబంధించిన రహస్య సమాచారంతో పాటు కీలక పత్రాలను వింగ్ కమాండర్ ఆమెకు షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వింగ్ కమాండర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తిహార్ జైలుకి తరలించారు. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు.
మహిళ హనీట్రాప్ లో చిక్కుకున్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్.. సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని పాక్ గూఢచార కార్యకర్తలతో పంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిఫెన్స్ కు సంబంధించిన రహస్య సమాచారం, గోప్యమైన రక్షణ పత్రాలను షేర్ చేశాడనే ఆరోపణలపై ఆ అధికారిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నిబంధనల కింద కేసు నమోదు చేశామని, జ్యుడిషియల్ కస్టడీలో ఉంచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఆ అధికారి సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో పరిచయం ఏర్పరచుకుని హనీట్రాప్‌కు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి. డివైస్ పై యాక్సెస్ పొందే ప్రయత్నంలో, అతను తన సహోద్యోగి మొబైల్ ఫోన్‌లో డేటాను దొంగిలించే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశాడని దర్యాప్తు అధికారులు ఆరోపించారు.
ఐఏఎఫ్ నిఘా విభాగం ఢిల్లీ పోలీసులకు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది. సున్నితమైన సమాచారం లీకేజీకి సంబంధించిన కార్యకలాపాల పట్ల తాము ఏమాత్రం సహించేది లేదని ఐఏఎఫ్ తేల్చిచెప్పింది. గట్టి నిఘా చర్యలతో ఈ వ్యవహారం గుర్తించగలిగామని ఐఏఎఫ్ ప్రకటించింది.












